UPDATED 25th JULY 2019 THURSDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రగతి ఇన్నోవేషన్ హబ్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిలైట్ ఇండియా డైరెక్టర్స్ వెంకటేష్ సర్వసిద్ధి, అమిత్ వర్మ, ఇన్సిస్పార్క్ ఫౌండర్, సిఈవో ఆసిన్ చవాన్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యమ్రాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రార్ధనా గీతాన్ని ఆలపించిన అనంతరం కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ప్రగతి ఇన్నోవేషన్ హబ్ జిల్లాలోనే ప్రథమ ఇన్నోవేషన్ సెంటర్ అని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొదించుకంటూ నూతన అవిష్కరణలు చేయాలని అన్నారు. డిలైట్ ఇండియా సహకారంతో నిర్వహిస్తున్న ఈ హబ్ విద్యార్ధులకు కావలసిన స్కిల్ డవలప్ మెంట్ అందించి మంచి వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతారని అన్నారు. ముఖ్య అతిధులు వెంకటేష్ సర్వసిద్ది, అమిత్ వర్మ మాట్లాడుతూ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులలో నూతన ఆవిష్కరణలు చేయడానికి కావలసిన దృఢమైన అభిలాష, సామర్ధ్యాలను ఈ హబ్ పెంపొందిస్తుందని అన్నారు. ప్రతీ సంవత్సరం 12 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారని, వారిలో 4.5 లక్షల మంది మాత్రమే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. మిగిలిన విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ స్టార్ట్ అప్ లు మంచి మార్గమని, ఈ దిశగా వెళ్ళడం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు, ఉపాధి లభిస్తుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసాల్ట్ సిస్టమ్స్ అప్లైడ్ రోబొటిక్ కంట్రోల్ ల్యాబ్, సీమెన్స్ ల్యాబ్ లు నైపుణ్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల స్వయంశక్తి, ఆలోచనలకే కాకుండా సామాజికాభివృద్దికి ఈ హబ్స్ ఒక నూతన మార్గాలను ఏర్పరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, సిఎసి మెంబర్లు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



