UPDATED 23RD AUGUST 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం పాఠశాల హెచ్ఎం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ మాట్లాడుతూ టంగుటూరు అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరూ నడవాలన్నారు. నీతి, నిజాయతీలకు మారుపేరు ప్రకాశం పంతులని, నాటి రోజుల్లోనే ప్రజాసేవకే అంకితమైన వ్యక్తుల్లో ప్రకాశంపంతులు ఒకరన్నారు. ఆయన నిరాడంబరతను స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. టంగుటూరి వేషధారణలో విద్యార్ది నక్కా అజయ్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గోవిందు, కెవివి సత్యనారాయణ, ఎపి రాజేంద్ర కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు టి. వైకుంఠం, లక్ష్మీశ్రీనివాస్, వల్లి, తదితరులు పాల్గొన్నారు.







