UPDATED 14th FEBRUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా 700 కాపు కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోటలో రూ.83 లక్షలతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ఆయన గురువారం ప్రారంభించారు. వీటిలో 13వ వార్డులో రూ.50 లక్షలతో నిర్మించిన కాపు కళ్యాణ మండపం, 3వ వార్డులో రూ.23 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, 6వ వార్డు బ్రౌన్ పేటలో రూ.10 లక్షలతో నిర్మించిన జియంసి బాలయోగి పార్కు ప్రహారీగోడ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ.3 వేల కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 700 కాపు కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని, పెద్దాపురం నియోజకవర్గంలో 10 కళ్యాణ మండపాలు నిర్మాణం చేపట్టామని తెలిపారు. మొట్టమొదటి సారిగా అచ్చంపేట కళ్యాణ మండపం ప్రారంభించామని, రెండవది సామర్లకోట అని చెప్పారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. ఈ కళ్యాణ మండపానికి స్థలం కేటాయించిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు మంత్రి అభినందించారు. ఈ కళ్యాణ మండపంలో వంట షెడ్డు, డైనింగు హాలు నిర్మిస్తామని, అలాగే ఈ కళ్యాణ మండపాన్ని తక్కువ అద్దెకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం సమానమైన సంక్షేమ పథకాలు అందించిందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, దూది రాజబాబు, మహాంకాళి గణేష్, పంచాయతీ రాజ్ డిఇ హరినాధరావు, తోటకూర శ్రీనువాసు, తదితరులు పాల్గొన్నారు.







