UPDATED 6th FEBRUARY 2020 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): గిరిజన ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో గల ఆరోగ్య సిబ్బందికి స్థానిక గిరిజన యువత శిక్షణా కేంద్రంలో రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. స్టేట్ కోఆర్డినేటర్ డి.ఎస్.ఎన్.మూర్తి అధ్యక్షతన ప్రారంభమైన శిక్షణలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గిరిజనులకు అనారోగ్య సమస్యలు తలెత్తినపుడు మెరుగైన వైద్య సేవలను వారి దరికి చేర్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదివాసీ ఆరోగ్య పథకం కింద వైద్య సేవలు అందిస్తున్నామని, అలాగే గిరిజన హాస్టల్స్ లోని విద్యార్థులకు మంచి పౌష్ఠిక విలువలతో కూడిన ఆహారం అందజేయడం జరుగుతుందని చెప్పారు. గిరిజన యువత శిక్షణా కేంద్రంలో వారికి ఉపాధికి అనువైన శిక్షణలు ఇచ్చి వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, బి.ఎస్. కుమార్, డి. నాగ శిరీష, తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, అప్పలరాజు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన మెటీరియల్ ను జేసీ ఆవిష్కరించారు.







