UPDATED 16th JUNE 2019 SUNDAY 8:00 PM
పెద్దాపురం: స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో జేష్ఠ శుద్ధ పౌర్ణమి తిథిని పురస్కరించుకుని చండీహోమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ ఆధ్వర్యంలో పవిత్ర వేద మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటని, లోక కళ్యాణార్ధం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్ సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోందని, ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమమని వేద పండితులు ఈ హోమం విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేదపండితులు ఐవి ప్రసాద్ శర్మ, ఏవి భానుమూర్తి, ఎన్.వి. శాస్త్రి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. .







