* డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు
UPDATED 14th JULY 2020 TUESDAY 5:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): కరోనా విపత్కర పరిస్థితుల్లో వీధి బాలలు, అనాధలను గుర్తించి వారికి సంరక్షణ కల్పించాలనే సదుద్దేశంతో ముస్కాన్ కోవిడ్-19 వాహనాన్ని ప్రారంభించడం జరిగిందని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 వాహనాన్ని మంగళవారం ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి ఆధారం లేని వీధిబాలలు, అనాథలను గుర్తించి వారికి సంరక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. పోలీసు, కార్మిక, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 వాహనం డివిజన్ పరిధిలో రోజుకొక సర్కిల్ లో తిరుగుతుందని తెలిపారు. ఈ వాహనం ద్వారా గుర్తించిన పిల్లలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం రెస్క్యూ హౌస్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఎవరైనా బాల కార్మికులను గుర్తించి తమకు సమాచారం అందిస్తే తక్షణమే వారికి సంరక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ భారీ నుంచి తమను తాము రక్షించుకోవాలని డిఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇనస్పెక్టర్ జయకుమార్, లేబర్ ఇనస్పెక్టర్ కోరుమిల్లి రఘుపతి, పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







