* ఫ్యాక్టరీల యాజమాన్యాలకు తహసీల్దార్ హెచ్చరిక
UPDATED 28th JANUARY 2020 TUESDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలను పెద్దాపురం తహసీల్దార్ కోనాడ పద్మావతి హెచ్చరించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ప్రజా సంఘాల నాయకులతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు ఇటీవల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుధా ఆగ్రో ఆయిల్ ఇండస్ట్రీస్, లలిత ఇండస్ట్రీస్, బ్లూఓషన్స్ బయోటెక్, సెవెన్ హిల్స్ పేపర్ మిల్స్ ఫ్యాక్టరీల నుంచి దుర్గంధంతో పాటు నల్లటి రజను గాల్లో వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారని, దీనిని అరికట్టవలసిన బాధ్యత సంబంధిత ఫ్యాక్టరీలదే అని ఆమె పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధి మంచిదే కానీ ప్రజలకు హాని చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలను ఆమె తనదైన శైలిలో హెచ్చరించారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న నల్ల బూడిను ఆమె ఫ్యాక్టరీల యాజమాన్యాలకు చూపించారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని, ఏ ఫ్యాక్టరీ నుంచి దుర్గంధం, నల్లటి రజను వెలువడుతోందో గ్రహించి ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్యంపై ఒక జాయింట్ యాక్షన్ కమిటీని రూపొందించడం జరుగుతుందని, ఈ కమిటీలో చైర్మన్ గా ఆర్డీవో, కన్వీనరుగా తహసీల్దార్, కో కన్వీనరుగా మున్సిపల్ కమీషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, అలాగే ప్రజా సంఘాల నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారన్నారు. పట్టణంలో ఉన్న అన్ని పరిశ్రమలను పరిశీలించి నివేదిక తయారు చేసి ఆ తర్వాత నివేదికను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత ఫ్యాక్టరీని మూసివేయడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జి. శేఖర్, ఆర్డీవో కార్యాలయం ఏవో చిన్నారావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రమేష్, శ్రీఫణి, ప్రజా సంఘాల నాయకులు నీలపాల సూరిబాబు, దారపురెడ్డి క్రాంతికుమార్, మహ్మద్ ముక్తార్ అలీ, తదితరులు పాల్గొన్నారు.







