* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి
UPDATED 17th AUGUST 2020 MONDAY 7:30 PM
అమలాపురం (రెడ్ బీ న్యూస్): జిల్లాలో అన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. పి.గన్నవరం మండలం గంటి పెదపూడి, బూరుగులంక, ఊడిమూడి తదితర వరద ముంపు గ్రామాలలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణతో ఆయన సోమవారం కలిసి పర్యటించారు. అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో 27 మండలాలను వరద తాకిడి ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందని, ఆయా మండలాలకు సంబంధించి అన్ని గ్రామాల్లో పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐదు మండలాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని, ఆ కేంద్రాల్లో వరద బాధితులకు భోజన సదుపాయం, వైద్య సేవలతో బాటు కరోనా కాలం కారణంగా శానిటైజర్లు, మాస్క్ లు ఏర్పాటు చేశామని అన్నారు. దిగువ ప్రాంతాలైన లంక గ్రామాల్లో కూడా పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని, ఇప్పటివరకు సుమారు ఆరు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని, లంక గ్రామాల్లో వరద బాధితులకు రేపటికల్లా రేషన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో వరదల కారణంగా ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.







