UPDATED 10th APRIL 2018 TUESDAY 8:00 PM
సామర్లకోట: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా అన్నారు. స్థానిక సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రం (టిటిడిసి) లో మంగళవారం జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో కలెక్టరు పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు లేవని, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళల ద్వారా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో స్వయం సహాయక సంఘాలు భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రభుత్వం ద్వారా మహిళా సంక్షేమం కోసం మహిళలు పొదుపు సంఘాలుగా ఏర్పడి వారి ఆర్థికాభివృద్ధి కొరకు పావలా వడ్డీ రుణాలు అందించడం జరిగిందని, అలాగే మహిళలకు దీపం కనెక్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాలలోని మహిళలకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని వారు గ్రామాభివృద్ధికి పాటుపడి ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు లబ్దిని పొందడానికి, అలాగే ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని, నిర్మించిన మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రతి ఒక్కరూ భాద్యత తీసుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేలా కృషి చేయాలన్నారు. గ్రామాభివృద్ధికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటి అమలుకు కృషి చేయాలని తెలిపారు. చంద్రన్న బీమా పధకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం కొరకు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలో ఏ పంచాయితీ కార్యదర్శి అయినా, ఉద్యోగి అయినా డబ్బులు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టరు సూచించారు. మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి అందిస్తున్న ఋణాలు చెల్లింపులో సహకరించని బ్యాంకర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ మేరకు త్వరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి మహిళా సంఘాల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) జిల్లాగా ప్రకటించడం జరిగిందని, అందువలన ప్రతి ఇంటిలో నిర్మించుకున్న మరుగుదొడ్డి వాడకం గురించి ప్రజలను చైతన్యం పరచడానికి ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు సహకరించాలన్నారు. గ్రామాలలో ఇంకా మరుగుదొడ్లు నిర్మించుకోని వారి పేర్లు తెలియచేయాలని, వారి ఇళ్లల్లో వెంటనే మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సమాఖ్య సభ్యులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులకు ఈ నెల 24వ తేదీన మండపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా జరిగే సభావేదికపై పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తానని కలెక్టరు తెలిపారు. గ్రామాల్లోని జన్మభూమి కమిటీలలో స్వయం సహాయక సంఘాల సభ్యులను పాల్గొనేలా అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లా సమాఖ్య సమావేశంలో తెలుసుకున్న విషయాలను వారి వారి మండల, గ్రామ సమాఖ్యలలో సభ్యులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి హాజరైన గ్రామ సమాఖ్యల సభ్యులు వారి వారి సమాఖ్యలలో చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని తాళ్లరేవు మండలానికి చెందిన విజయలక్ష్మీ, గోకవరం మండలానికి చెందిన రామలక్ష్మి, యు. కొత్తపల్లికి చెందిన సావిత్రి, రౌతులపూడికి చెందిన సత్యవతి, కాకినాడ రూరల్ సూర్యారావుపేటకు చెందిన సరస్వతి, సీతానగరం మండలం తాటవరం గ్రామానికి చెందిన ఎం. బాపనమ్ము, అంబాజీపేటకు చెందిన మాణిక్యాంబ, ముండపేటకు చెందిన సత్యవతి, ఇతర సమాఖ్యల సభ్యులు మాట్లాడుతూ జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా స్వయం సహాయక సంఘాల మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారు ఆర్థికంగా బలోపేతం చెందడానికి ఎంతో కృషి చేస్తున్నారని వారు మా పట్ల చూపుచున్న ప్రత్యేక శ్రద్ధతో సమాఖ్యల తరపున కృతజ్ఞతలు తెలియచేసారు. బ్యాంకులలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు సరైన సహకారం అందడం లేదని, అలాగే వారికి సబ్సిడీ సొమ్ము చెల్లించడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. స్వచ్చభారత్, సాధికార సర్వే, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులోను మహిళ సంఘాలు సభ్యులు సహకారం అందిస్తున్నామని తెలిపారు.







