UPDATED 24th AUGUST 2017 THURSDAY 9:00 PM
రాజమహేంద్రవరం : కోర్టుల్లో క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించకుండా సత్వర కేసుల పరిష్కారం పేరుతో దిగువ స్థాయి జడ్జీలు, లాయర్లు, కక్షిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు విడుదల చేసిన అశాస్త్రీయ సర్క్యులర్లను పున సమీక్షించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో న్యాయవాదులు ఆందోళన చేశారు. ఈ మేరకు గురువారం విధులు బహిష్కరించి బార్ అసోసియేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ హైకోర్టు విడుదల చేసిన అశాస్త్రీయ సర్క్యులర్‌ను పునసమీక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల మంది న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారన్నారు. హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ల ఆధారంగా దిగువస్థాయి న్యాయమూర్తులు, న్యాయవాదులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, ఈ సర్కులర్ వల్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షి దారులు మానసిక ఒత్తిడికి గురవుతారన్నారు. తక్షణం హైకోర్టు విడుదల చేసిన అశాస్త్రీయ సర్క్యులర్‌ను పునపరిశీలించాలని, సత్వర కేసుల పరిష్కారం కోసం న్యాయమూర్తుల పోస్టులు భర్తీచేయాలని, లా కమిషన్, పార్లమెంటు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయమూర్తులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పీఆర్.ఎస్.మిత్ర, అల్లు వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.







