UPDATED 16th FEBRUARY 2019 SATURDAY 9:00 PM
సామర్లకోట: మున్సిపాలిటీలో జీవో 279 అసలు అమలు జరుగుతోందా లేదా అని ప్రతిపక్ష కౌన్సిలర్లు శానిటేషన్ అధికారులను ప్రశ్నించారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్ పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షతన శనివారం వాడీవేడిగా జరిగింది. కౌన్సిల్ ప్రతిపక్ష సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజెస్ మాట్లాడుతూ గతంలో పట్టణంలో శానిటేషన్ నిర్వహణ సక్రమంగా ఉండేదని, జీవో నెంబర్ 279 అమలుచేసిన నాటి నుంచి సంబంధిత కాంట్రాక్టర్ పారిశుధ్య పనులు సరిగా పట్టించుకోవడం లేదని వారు ధ్వజమెత్తారు. పట్టణంలో శానిటేషన్, వార్డుల్లో అభివృద్ధి, తదితర అమాశాలపై జరగాల్సిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు డీఈ రామారావు, శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్ తదితరులు సమాధానాలు ఇచ్చారు. అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమీషనర్ నాగేంద్ర కుమార్ ను కౌన్సిల్ కు పరిచయం చేసిన అనంతరం మున్సిపల్ కమీషనర్ గా పనిచేసిన సిహెచ్ వెంకటేశ్వరరావు, ప్రస్తుత మున్సిపల్ కమీషనర్ నాగేంద్రకుమార్ లను మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో పి. సత్యవతి,.కురుకూరి సోమేశ్వరరావు, కోడెల అర్జునరావు, తదితరులు పలు సమస్యలపై మాట్లాడారు. కౌన్సిల్ సమావేశం అనంతరం జమ్మూ కాశ్మీర్ లో మృతి చెందిన వీర జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.







