రూ. 40 లక్షలతో భీమేశ్వరస్వామి ఆలయ రోడ్లకు వీధిలైట్లు

UPDATED 19th OCTOBER 2018 FRIDAY 5:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో రూ.40 లక్షలు గుడా నిధులతో వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో పులి నారాయణమూర్తి వేదపండితులచే పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లను మంత్రి చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి చినరాజప్ప విలేఖర్లతో మాట్లాడుతూ భీమేశ్వరస్వామి ఆలయం నుంచి వంతెన వరకు వీధిలైట్లు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే భక్తుల సౌకర్యార్ధం గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెన, టూరిజం శాఖ ద్వారా డార్మెటరీలు మహాశివరాత్రికి పూర్తి చేయడం జరుగుతుందని, దేవాలయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్తీకమాసంలో దేవాలయానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని స్వామి, అమ్మవార్లను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, అన్నదాన ట్రస్టు ప్రతినిధులు బిక్కిన పరమేశ్వరసాయి, సత్యనారాయణ, చుండ్రు గోపాలకృష్ణ, మన్యం చంద్రరావు, కౌన్సిలర్లు, దేవస్థానం అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us