* అధికారుల తీరుపై పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఫైర్
UPDATED 27th DECEMBER 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన భాద్యత అధికారులపై ఉందని పెద్దాపురం ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం--సామర్లకోట రహదారిలో పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలను కేటాయించేందుకు అధికారులు సిద్ధం చేసిన సుమారు ఐదు ఎకరాల నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనాలోచితంగా ఈ స్థలాన్ని ఎంపిక చేసిన తీరుపై ఎమ్మెల్యే అధికారులపై ఫైర్ అయ్యారు. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ స్థలాలను కేటాయించే విషయంలో తాము వ్యతిరేకం కాదని, భవిష్యత్తులో పట్టణంలో ఏ ప్రభుత్వ కార్యాలయం నిర్మించాలన్నా స్థల సమస్య ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. ఈ స్థలంలో విస్తృతమైన ప్రజా ప్రయోజనాల రీత్యా బిసి వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ వసతి గృహాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేందుకు గతంలో ప్రతిపాదించడం జరిగిందని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలను కేటాయించే విషయంలో రామేశంమెట్ట భూములను పరిశీలించాలని అన్నారు. ఈ విషయంలో అధికారులు తమ సొంత నిర్ణయాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, అవసరమైతే అందరికీ అందుబాటులో ఉండే భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి పేద ప్రజలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆర్డీవో ఎస్. మల్లిబాబుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, టిడిపి మండల అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, తదితరులు పాల్గొన్నారు.







