* ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు
* ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
UPDATED 25th JANUARY 2019 FRIDAY 6:00 PM
పెద్దాపురం: ఓటును సద్వినియోగం చేసుకోవడం ద్వారానే ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవచ్చని పెద్దాపురం నియోజవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఓటుహక్కుపై అవగాహనా ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఓటుహక్కు ప్రాముఖ్యతపై నిర్వహించిన సభలో ఆర్డీవో పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పొందడం ఎంత ముఖ్యమో దాన్ని వినియోగించడం అంతే ప్రధానమని, దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తూ నాయకులను ఎన్నుకోవడం జరుగుతోందని అన్నారు. ఓటుహక్కు పొందిన ప్రతీ ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి నిస్వార్థపరులైన నాయకులను ఎన్నుకుంటే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తాయని అన్నారు. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు నమోదు చేయించుకోవాలని, ఓటును వేరేచోటుకు మార్చుకోవడానికి ఫారం-7, చిరునామా, పేర్లలో మార్పులు, చేర్పులు ఉంటే ఫారం-8 ద్వారా దగ్గరలోని పోలింగు కేంద్రాలలో సరిచేసుకోవచ్చని తెలిపారు. గతంలో పోలింగు కేంద్రాలలో సదుపాయాలు సరిగా ఉండేవి కాదని, ప్రస్తుతం అన్ని పోలింగు కేంద్రాలలో విద్యుత్, త్రాగునీరు, వికలాంగులకు ర్యాంపులు, తదితర సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం సీనియర్ ఓటర్లు సూర్యనారాయణమూర్తి, ఎజ్రాలను ఆర్డీవో దుశ్శాలువాలతో సత్కరించారు. ఓటుహక్కుపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు మెమోంటోలు, ప్రశంసాపత్రాలు, అలాగే ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముందు ఓటుహక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎలక్షన్ కమీషన్ సిఇవో ప్రసంగాన్ని విద్యార్థినీ, విద్యార్థులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, వార్డు కౌన్సిలర్లు విజ్ఞపు రాజశేఖర్, పెదకాపు, సామర్లకోట తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఆర్డీవో కార్యాలయం ఏవో నాంచారయ్య, పెద్దాపురం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు, ఎంఇవో ఎం.వి. దుర్గాప్రసాద్, ఎలక్షన్ డిటి కృష్ణ, రెవెన్యూ ఇనస్పెక్టర్ తేజ, మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







