UPDATED 29th DECEMBER 2018 SATURDAY 5:00 PM
పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి నెల 2 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దాపురం నియోజకవర్గ ప్రత్యేక అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయికి చెందిన వివిధ శాఖల అధికారులతో ఆరవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో హాజరై ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాలని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో దండోరా వేయించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాజాతాలు, వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించాలని అన్నారు. గ్రామ సభల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని టెలివిజన్ ఏర్పాటు చేసి ప్రజలకు ప్రదర్శించాలని అన్నారు. గ్రామాల్లో ర్యాలీగా తిరగాలని, గ్రామాల అభివృద్ధి మ్యాప్ ను తయారు చేయించి ప్రదర్శనకు పెట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చుకుని ఉండాలని అధికారులు ఎటిఆర్ సక్రమంగా తయారు చేసుకుని ఉంచుకోవాలన్నారు. ఏ రోజుకారోజు జన్మభూమి నివేదికను సాయంత్రంలోగా జిల్లా అధికారులకు తెలియచేయాలని తెలిపారు. ఈ గ్రామసభలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట, పెద్దాపురం మండల ప్రత్యేక అధికారులు మల్లిఖార్జునరావు, ఎ. రాజశేఖర్, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఎంపిడివో పల్లాబత్తుల వసంతమాధవి, జగ్గారావు, సామర్లకోట మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, పెద్దాపురం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, ఎ.ఎస్.డబ్ల్యు.వో గాయత్రి, వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.







