* అట్టహాసంగా తుమ్మల రామస్వామి నామినేషన్
* జనసేన జెండాల రెపరెపలతో ఆద్యంతం కోలాహలం
UPDATED 25th MARCH 2019 MONDAY 9:00 PM
పెద్దాపురం/సామర్లకోట: జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తుమ్మల రామస్వామి(బాబు) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడుకి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. తొలుత పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో తన గృహం నుంచి బయటకు రాగానే భారీ ఎత్తున మహిళలు నిండు నీళ్ల బిందెలతో ఎదురువచ్చి హారతులు ఇచ్చారు. అనంతరం ప్రచార రథంపై పులిమేరు గ్రామం నుంచి భారీ ఊరేగింపుతో ర్యాలీగా బయలుదేరి దివిలి, తిరుపతి, మర్లావ, కాండ్రకోట, సిరివాడ, గుడివాడ గ్రామాల మీదుగా పాత పెద్దాపురం, దర్గాసెంటర్, మరిడమ్మ గుడి సెంటర్, కుమ్మరవీధి, మున్సిపల్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. తీన్‌మార్ డ్యాన్సులతో యువత నృత్యాలు చేస్తూ జై జనసేన అంటూ కేకలు వేస్తూ రహదారులు మొత్తం హోరెత్తించారు. జనసేన జెండాల రెపరెపలతో ఆద్యంతం కోలాహలం నెలకొంది. నామినేషన్ వేసిన అనంతరం ప్రచార రథంపై నుంచి పార్టీ శ్రేణులను ఉద్దేశించి తుమ్మల రామస్వామి(బాబు) మాట్లాడుతూ రాష్ట్రంలో బూర్జువా పార్టీలు రాజ్యం ఏలుతున్నాయని వీటికి అడ్డుకట్ట వేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ఆకాశమంత ప్రేమ ఉన్న జన సైనికులు తనకు అండగా ఉన్నారని తెలిపారు. జనసేన పార్టీ అన్ని సామాజిక తరగతుల వారికీ సముచిత ప్రాధాన్యమిస్తుందని, అవినీతిరహిత రాష్ట్రంగా ఏపీని నిలపాలనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. జనసేన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని గెలిపించేందుకు కార్యర్తలు కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ మహనీయుల మార్గంలోనే నడుస్తుందని, అన్ని పార్టీల్లా కాకుండా మన పార్టీకి ఓ సిద్ధాంతం ఉందన్నారు. అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గణేష్ నాయుడు, సరోజ్ వాసు, అంజి, తుమ్మల నాగబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







