UPDATED 13th NOVEMBER 2017 MONDAY 6:00 PM
మండపేట : కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో పోటెత్తాయి. మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలలో కార్తీక దీపారాధన పూజలు చేశారు. అత్యంత ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన పురాతన శైవక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో గల సంఘమేశ్వర దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించేందుకు బారులు తీరారు. ఇక్కడ త్రివేణి సంగమమైన తటాకంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు. ఆవరణలోని నందీశ్వరుని వద్ద దీపాలు వెలిగించి కుంకుమ పూజలు చేశారు. అలాగే మండపేట శ్రీ అగస్త్యేశ్వర జనార్దనస్వామి ఆలయంలో అభిషేకాలు, హోమాది యాగ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పనపాడు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. కేశవరం, ద్వారపూడి, చినద్వారపూడి, మెర్నిపాడు, వెలగతోడు, పాలతోడు, తాపేశ్వరం, అర్తమూరు, మారేడుబాక శివాలయాల్లో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించారు.







