UPDATED 28th SEPTEMBER 2017 THURSDAY 9:00 PM
రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ అష్టమి గురువారం ఎనిమిదవరోజు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయదుర్గా అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పంచద్రవ్యాలతో అభిషేకాలు, విఘ్నేశ్వర పూజ, నవగ్రహ హోమాలు, దుర్గా అష్టోత్తర సహస్రనామాలు, విష్ణు, లలితా సహస్రనామాలు తదితర పారాయణాలు, పూజాదికాలు ఘనంగా నిర్వహించారు. భక్తులనుద్దేశించి పీఠాధిపతి గాడ్ ప్రసంగిస్తూ శరన్నవరాత్రుల్లో నేడు ఎంతో ప్రాముఖ్యమైనదని, ఈ అవతారంలో అమ్మవారు దుర్గముడనే రాక్షసుడిని ఈ అష్టమి తిథి రోజునే సంహరించిందని, అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమిగా వ్యవహరిస్తారన్నారు. దుర్గతులను నివారించే శక్తి రూపమైన దుర్గాదేవిగా నేడు అమ్మవారు దర్శనమిచ్చారన్నారు. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం ప్రథమమైందని, భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని, కోటిసూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని అర్చిస్తే శత్రుబాధలు తొలిగి, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందన్నారు. అనంతరం పెండం ధర్మారావు భాగవతార్, కేశాప్రగడ సత్యనారాయణల శ్రీనివాస కళ్యాణం హరికథాగానం, దేవీ భాగవతం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చక్రవర్తుల మాధవాచార్యులు, చీమలకొండ వీరావధాని, తోలేటి నాగేంద్ర శర్మ, చీమలకొండ శ్రీనివాస్, పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి. బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి), తదితరులు పాల్గొన్నారు.







