* నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిచేస్తా
* ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
UPDATED 1st APRIL 2019 MONDAY 9:00 P
సామర్లకోట/పెద్దాపురం: రానున్న ఎన్నికల్లో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం సామర్లకోట పట్టణ పరిధిలో గల పలు వార్డులతో పాటు మండల పరిధిలోని కాపవరం, పండ్రవాడ తదితర గ్రామాల్లో ఇంటింటా విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గాన్ని సుమారు రూ.1200 కోట్లతో అభివృద్ధి చేశానని, నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి పథకాలే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదం చేస్తాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు పలు సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు టిడిపిలోకి చేరారు. వారికి మంత్రి చినరాజప్ప పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. అలాగే పెద్దాపురం పట్టణ పరిధిలోని 9,11,12,13 వార్డుల్లో మంత్రి చినరాజప్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈబీసీ కార్పోరేషన్ చైర్మన్ కెవివి సత్యనారాయణరాజు (చైతన్యరాజు), తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, బడుగు శ్రీకాంత్, ముత్యాల రాజబ్బాయి, మన్యం చంద్రరావు, తోట సుబ్బారావు నాయుడు, ఎమ్మిరెడ్డి ఉమామహేశ్వరి, బావిశెట్టి చక్రం, బావిశెట్టి సందీప్, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, కౌన్సిలర్ త్సలికి సత్యభాస్కరరావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







