* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి
UPDATED 9th NOVEMBER 2020 MONDAY 7:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): ఆరోగ్య మిత్రలు సేవాభావంతో పనిచేసి పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్య సేవలు సంపూర్ణంగా అందించాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఇటీవల నియమితులైన ఆరోగ్య మిత్రలకు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వివేకానందా హాలులో సోమవారం రీఓరియెంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని ఆరోగ్య మిత్రలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పేద, మధ్య తరగతి ప్రజలు తమకు ఆరోగ్య సమస్యలు వస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవని, ఆరోగ్యశ్రీ పధకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్న వర్గాలకు ఈ పథకం ఒక భరోసాగా నిలిచిందన్నారు. ఈ పధకం ప్రారంభించినప్పటి నుంచి దశలవారీగా వైద్య సేవలు పెంపొందించడం జరిగిందని, అందులో భాగంగా పేదవారు ఎవరైన ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కావల్సివస్తే ప్రముఖులకు లభించే వైద్య సేవలు మాదిరిగా అందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పధకం అమలుకు ముఖ్యమంత్రి ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్య మిత్రలు పని చేయాలన్నారు. ఈ పధకం పగడ్బందిగా అమలు జరిగే విధంగా గ్రామాల్లో రెండువేల కుటుంబాలకు ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి ఒక మినీ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కేంద్రం వద్ద హెల్త్ క్లినిక్ లో పని చేసే ఏఎన్ఎంకు నివాసం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రోగులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా గ్రామ హెల్త్ క్లినిక్స్ పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారంగా ప్రైవేట్ ఆసుపత్రులు రుసుములు వసూలు చేయాలని, ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసిన ఆయా ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆరోగ్య మిత్రలు తాము పని చేసే ఆసుపత్రులు, అక్కడ పరిస్థితులను గమనిస్తూ తగిన విధంగా సమాచారం అందించాలని కలెక్టర్ ఆరోగ్య మిత్రలకు దిశా నిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆరోగ్య మిత్రలు ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆసుపత్రులలో ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు డాక్టర్లు, నర్సులు పనివేళల్లో ఉంటున్నారా లేదా అనే అంశాలను గమనించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ పధకం ద్వారా వైద్య సేవలు పొందే వారికి సంపూర్ణ వైద్య సేవలు అందించే విధంగా ఆరోగ్య మిత్రలు పని చేయాలని, ముఖ్యంగా ఆరోగ్య మిత్రలు నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పనిచేసే ఆరోగ్య మిత్రలతో సమన్వయంతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా జెసీ వ్యాధిగ్రస్తులు ఎవరైన ఆరోగ్య మిత్రలను సంప్రదిస్తే వెంటనే ఎలా స్పందిస్తారు, వైద్య సేవలు అందించడానికి ఎవరితో మాట్లాడతారు, తదితర అంశాలను నూతనంగా ఎంపికైన ఆరోగ్య మిత్రల ద్వారా అడిగి తెలుసుకొన్నారు. పేద రోగులను సేవా దృక్పధంతో తమ కుటుంబ సభ్యులుగా భావించి ఆరోగ్యశ్రీ సేవలు అందించే విధంగా పని చేయాలని జేసి ఆరోగ్య మిత్రలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి. రాధాకృష్ణ, మేనేజర్ డి. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.







