UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 10:00 PM
★ మలికిపురం ఏఎఫ్‌డీటీ కళాశాలలో తాత్కాలిక బస్టాండ్
★ డీఎస్‌పీ వై.మాధవరెడ్డి వెల్లడి
★ భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచన
అమలాపురం (రెడ్ బీ న్యూస్): అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ ఉత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అమలాపురం డీఎస్‌పీ వై.మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మలికిపురం ఏఎఫ్‌డీటీ కళాశాలలో ప్రత్యేక, తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటుచేశామని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఈ బస్టాండ్‌కు చేరుకున్న భక్తులను ప్రత్యేక ఆర్‌టీసీ బస్సుల ద్వారా అంతర్వేది ఆలయం వద్దకు చేర్చనున్నట్లు వెల్లడించారు. అంతర్వేదిపాలెం ఇన్‌పాయింట్ ద్వారా ఈ వాహనాలు ఆలయం వద్దకు వెళతాయని.. వేరే మార్గం ద్వారా వాహనాలు అంతర్వేది నుంచి బయటకు వస్తాయని వివరించారు. అదే విధంగా ప్రైవేటు వాహనాలను అంతర్వేది పాలెం వద్ద వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. వార్షిక కల్యాణ ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్నానాలు చేసే ప్రాంతాల్లో పోలీసుల సూచనలు పాటించాలన్నారు. బీచ్‌తో పాటు ఆలయం వద్ద, టూరిజం గెస్ట్ హౌస్ వద్ద ప్రత్యేక పోలీస్ పోస్ట్‌లను ఏర్పాటుచేశామని.. కమాండ్ కంట్రోల్ రూం కూడా సేవలందిస్తుందని మాధవరెడ్డి తెలిపారు.







