UPDATED 9th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: గణేష్ ఉత్సవ కమిటీలు నిబంధనలు పాటించాలని పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు అన్నారు. స్థానిక పోలీస్ స్టేషనులో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో వినాయక చవితి వేడుకలలో తీసుకోవలసిన జాగ్రత్తలు,పాటించవలసిన నియమాలు గురించి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రామారావు మాట్లాడుతూ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పనిసరిగా పొందాలని, మండపాల్లో విద్యుత్ సౌకర్యం కోసం తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని అన్నారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల మనోభావాలకు ఆటంకం కలిగించరాదని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలు అనువైన ప్రదేశమా కాదా, ప్రజలకు, వాహన రాకపోకలకు ఏమైనా అసౌకర్యం కలిగే అవకాశముందా అని పరిశీలించాలన్నారు. గాలి, వర్షాలకు మండపాలు కూలిపోకుండా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగకుండా ఉండేలా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్థంభాలు నుంచి అనధికారంగా విద్యుత్ కనెక్షన్స్ తీసుకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మండపాల పరిసరాలలో మద్యం, జూదం, రికార్డింగ్ డ్యాన్సుల్లాంటి కార్యకలాపాలు చేపట్టరాదని, రాజకీయ ప్రసంగాలు, నినాదాలకు తావివ్వరాదన్నారు. వ్యక్తులు, సమూహాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరాదని, మండపాల వద్ద టపాసులు, తదితర పేలుడు వస్తువులు ఉంచరాదన్నారు. మండపాల వద్ద విగ్రహాలు ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకూ 24 గంటలూ సేవలందించేందుకు ముగ్గురు వాలంటీర్లను నియమించుకోవాలని, రాత్రి వేళల్లో కూడా ఒకరు తప్పనిసరిగా విగ్రహాల వద్ద అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండపాలు, పరిసరాల్లో ఏదైనా ఘటన జరిగినా, జరిగే అవకాశమున్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ముందస్తుగా నీళ్లు, ఇసుకతో నింపిన బకెట్లను అందుబాటులో ఉంచాలని, మండపాల పరిసరాల్లో ఈవ్ టీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగకుండా ఉండేలా నిర్వాహకులు దృష్టి సారించి ఈ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.







