ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి

UPDATED 25th FEBRUARY 2019 MONDAY 6:00 PM

పెద్దాపురం: శాంతిభద్రతల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పెద్దాపురం ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని సెక్టార్ అధికారులతో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతలు సక్రమంగా అమలుచేసి సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సెక్టార్ అధికారులు అధ్యయనం చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్టార్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇవ్వడం జరుగుతుందని, వీటిని దృష్టిలో పెట్టుకుని సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, కరెంటు, ర్యాంపులు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలు  ఉన్నాయో లేదో పరిశీలించాలని, అలాగే గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, బూత్ లెవెల్ అధికారుల ఫోన్ నెంబర్లను తెలుసుకోవాలన్నారు. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో పదిమంది సెక్టార్ అధికారులను నియమించడం జరిగిందని, వీరికి ఎనగ్జెర్ -1,2 గురించి ఆర్డీవో వివరించారు. ప్రతీ గ్రామానికి వెళ్లి నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని సెక్టార్ అధికారులు కల్పించాలని, అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదికలో పొందుపరచాలని చెప్పారు. తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎన్నికల్లో పనిచేస్తారని వీరి ద్వారా తమ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని అన్నారు. 10 సెక్టార్ అధికారులకు 20 రూట్లు కేటాయించడం జరిగిందని, పెద్దాపురం నియోజకవర్గంలో 211 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎమ్మెల్సీ మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రభుత్వ రహదారులపై ఎలాంటి అనుమతులు  లేకుండా ప్రచారం చేయరాదని, డివిజన్లలోని 12 మండలాల్లో జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా ఆదేశాల మేరకు మోడల్ కోడ్ అమలవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ అధికారులుగా నియమించబడ్డ వ్యవసాయ శాఖ ఎడిఏ ఎం. రత్న ప్రశాంతి, ఇఇవైఐ డివిజన్ డి.వి రామ్ గోపాల్, హౌసింగ్ ఈఈ బి. సుధాకర్ పట్నాయక్, మున్సిపల్ డీఈఈ ఆర్. రమేష్ బాబు, హౌసింగ్ డీఈఈ వై. శ్రీనివాస్, ఆర్&బి డీఈఈ ఎ.ఎస్. ప్రకాశరావు, ఎఫ్.టి.సి ఏడి బి.కె. మల్లిఖార్జునరావు, మున్సిపల్ డీఈఈ సి.హెచ్. రామారావు, ఎలక్షన్ డిటి శ్రీనివాస్, డిటి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us