UPDATED 16th MAY 2019 THURSDAY 9:00 PM
పెద్దాపురం: జిల్లాలో ఫైలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ఫైలేరియా నియంత్రణ అధికారిణి ఎన్. సుమతీదేవి అన్నారు. స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి వీధిలో గల ఫైలేరియా నియంత్రణ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన శిబిరంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధిపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఫైలేరియా వ్యాధి క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, మైక్రో ఫైలేరియా క్రిములు వ్యాధిగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు చేరడంతో ఒకరినుంచి మరొకరికి ఫైలేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. ఫైలేరియా వ్యాధినే వాడుక భాషలో బోదకాలు వ్యాధి అని పిలుస్తారని, వ్యాధి కారక దోమలు కుట్టిన తర్వాత ఫైలేరియా వ్యాధి లక్షణాలు 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు కనిపిస్తాయని, ఈ వ్యాధి వ్యాప్తికి ఆడ, మగ, వయస్సుతో సంబంధం లేదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు ప్రబలకుండా చూసుకోవాలని, దోమ తెరలను వినియోగించాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ వ్యాధిపట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు సబ్బులు, టవల్స్, టబ్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ ప్రసాద్, హెల్త్ ఇనస్పెక్టర్ పి. రామారావు, బి. శ్రీను, శ్రీహరి, ఫీల్డ్ సూపర్ వైజర్ కె. వీరబాబు, సతీష్, ఆర్. ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







