UPDATED 16th MARCH 2018 FRIDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో 2016-17, 2017-18, విద్యా సంవత్సరాలలో వివిధ గ్రామాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ క్యాంపులు, ప్రత్యేక శిబిరాల ద్వారా సుమారు 240 గంటలు పైబడి సేవలు అందించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందచేసినట్లు కో- ఆర్డినేటర్లు పి.శివకుమార్, జ్ఞానవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సేవాభావం కలిగి ఉండడం మన పూర్వజన్మ సుకృతమని, సేవారంగంలో ఉన్న వ్యక్తులు ఎప్పటికీ చరిత్రలో నిలుస్తారన్నారు. ఎన్ఎస్ఎస్ శిబిరాల ద్వారా గ్రామాలలో మీరు చేసిన ప్రజాహిత కార్యక్రమాల వల్ల ఆయా గ్రామాలకే కాకుండా, వ్యక్తిగతంగా మీకు ఎంతో సంతృప్తి కలుగుతుందని, అంతేకాక ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన నలుగురు విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు, ఇతర విద్యార్థులు, ప్రత్యేక శిబిరం నిర్వహణ వాలంటీర్లు సుమారు 140 మందికి ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు పిల్లా రవికిషోర్, అనుప్రకాష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.







