UPDATED 12th FEBRUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: పదవతరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక జిపిఎ సాధనకు ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతైనా అవసరమని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పాఠశాలలో ఆయన అధ్యక్షతన పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి ఎదుర్కొనే మొదటి పబ్లిక్ పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థిని పాజిటివ్ దృక్పథంతో ప్రోత్సహిస్తూ ప్రణాళికాబద్ధంగా రానున్న పరీక్షల్లో ప్రతిభ చూపి ఉత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉంటూ ఇప్పటివరకు నేర్చుకున్న అంశాలపై పునశ్చరణ చేసుకోవాలన్నారు. ఆహారపు అలవాట్లు, నిద్ర సమయానికి పాటిస్తూ మిగిలి సమయాన్ని చదువుకు మాత్రమే వినియోగించేలా చూడాలన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి వారి సందేహాలను నివృత్తి చేయడానికి తమ పాఠశాల సిబ్బందితో రాత్రివేళలు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మంచి ఫలితాలు సాధన ద్వారా ఎన్నో ఆశలతో చదివిస్తున్న తల్లిదండ్రులకు చదువుతున్న తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కె. అరుణ, జి. గోవిందు, ఏ.ఎల్.వి. కుమారి, కెవివి సత్యనారాయణ, బి. శ్రీలక్ష్మి, శ్రీనివాసు, ఏపీ రాజేంద్రకుమార్, డివిఆర్ఎన్ వల్లి, భద్రావతి, పిడి తాళ్లూరి వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.







