UPDATED 24th MARCH 2018 SATURDAY 7:00 PM
కిర్లంపూడి: ప్రతి విద్యార్థి తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని కిట్స్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కిట్స్ కాంపస్ లో నిర్వహించిన ట్రిపుల్ ఈ ఫైనల్ విద్యార్థుల వీడ్కోలు సభలో ఆయన ముఖ్య అతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులు పూర్తి కాగానే విద్యార్థుల బాధ్యత ముగియదని, ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నత స్థాయిలో నిలవడం ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే వరకు నిరంతరం విద్యార్ధిగానే ఉండాలన్నారు. తమ కళాశాల కల్పిస్తున్న క్యాంపస్ సెలక్షన్స్ లో పాల్గొని ఉపాధి పొందాలని అన్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా ప్రోత్సహించేందుకు తమ కళాశాల ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల ఆకాంక్షలు, మీ అభిరుచులకు అనుగుణంగా జీవితాలను సార్ధకం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఈ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ సర్వ రామేశ్వరుడు, ఎవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి బేతినీడి వీరేంద్ర చౌదరి, రామకృష్ణ, విశ్వేశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







