UPDATED 21ST AUGUST 2017 MONDAY 9:00 PM
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇప్పుడు ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే జాతి కోలుకోలేనంత వెనకబడిపోతుందని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం కిర్లంపూడిలో 27వ రోజు కాపుసంఘాల నాయకులు, మహిళలతో కలసి పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను గేటువద్ద పోలీసులు అడ్డగించడంతో అందరూ అక్కడే కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్ష కొనసాగించారు. పశ్చిమగోదావరి, విశాఖ, కృష్ణాజిల్లాలోని వివిధ మండలాలతో పాటు జిల్లాలోని అనపర్తి, పిఠాపురం ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, తుని, రాజమహేంద్రవరం, కాకినాడ నియోజకవర్గాల పరిధిలోని తదితర ప్రాంతాల నుంచి కిర్లంపూడి చేరుకుని ముద్రగడకు సంఘీభావం ప్రకటించారు. భారీసంఖ్యలో కాపుసంఘాల నాయకులు నల్లజెండాలను పట్టుకుని మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ కాపులు అందరూ ఏకతాటిపైకి వచ్చి జాతిప్రయోజనాల కోసం పోరాడాలని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత అందరూ రిజర్వేషన్లు పొందారని, స్వాతoత్య్రానికి ముందు నుంచి ఉన్న రిజర్వేషన్లును కాపులు కోల్పోయారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ప్రకటించే వరకు అందరూ శాంతియుత మార్గంలో పోరాటం సాగించాలన్నారు. అమరావతికి పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేవరకు కాపులంతా ఛలో కిర్లంపూడి కార్యక్రమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.







