ఉన్నతమైన జీవితానికి విద్య, విజ్ఞానం ఎంతో అవసరం

UPDATED 8th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

రాజానగరం: ఉన్నతమైన జీవితానికి విద్య, విజ్ఞానం ఎంతో అవసరమని కెఎల్ఆర్ విద్యా సంస్థల చైర్ పర్సన్ కె. నాగమణి అన్నారు. రాజానగరంలోని కెఎల్ఆర్ దంత వైద్య కళాశాలలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యునెస్కో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రకటించిందని, అక్షరాస్యతను వ్యక్తులు, సంఘాలకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవడాన్ని అక్షరాస్యత అంటారని, అయితే చదవటం, రాయడం మాత్రమే అక్షరాస్యత కాదని, గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని అన్నారు. విద్యను వీలున్నంత వరకు ధనంతో సంబంధం లేకుండా అందరికీ అందించాలన్నలక్ష్యంతో కెఎల్ఆర్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగిందని, కెఎల్ఆర్ ఆశయాలకు అనుగుణంగా  ఈ సంస్థలు నడుస్తున్నాయని అన్నారు.  పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించటంలో కెఎల్ఆర్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి మాట్లాడుతూ ప్రపంచం అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరమని, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం వెనుకబడి ఉందని అన్నారు. కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందున్నాయని, బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్నాయని, మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండడం విచారకరమని, స్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పిజి స్టడీస్ డాక్టర్ బి. లక్ష్మణరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us