* జనసేన నాయకుడు తుమ్మల బాబు ధ్వజం
* ఆరోపణలు రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ సవాల్
* పాదయాత్రలో జగన్ నడిచిన దారిని పసుపునీటితో శుద్ధి చేసి నిరసన
UPDATED 25th JULY 2018 THURSDAY 7:00 PM
పెద్దాపురం : తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని లూఠీ చేసిన నీచ చరిత్ర ఉన్న నువ్వా మా నాయకుడు పవన్ కల్యాణ్ ను విమర్శించేది అని జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి (బాబు) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ ఇటీవల చేసిన ఆరోపణలకు ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. అలాగే జగన్ పాదయాత్ర సందర్భంగా తిరిగిన రోడ్లను పసుపు నీటితో శుభ్రం చేసి తమ నిరసన తెలియచేశారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. చట్టసభల్లో ఉండి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని అంతేకాని రోడ్లపై తిరుగుతూ యాత్రలు చేస్తే రాదని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ ప్రజాకర్షణ చూసి ఓర్వలేక వ్యక్తిగత ఆరోపణలకు దిగి తన స్థాయిని మరింతగా దిగదార్చుకున్నారని అన్నారు. వ్యక్తిగత ఆరోపణల విషయానికి వస్తే ఆయన కుటుంబంపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, వాటిని ముందుగా తెలుసుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. ఇటువంటి చవకబారు ఆరోపణలు చేస్తే రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అలాగే నీకారణంగా ఎంతోమంది అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని విమర్శించారు. తమ నాయకుడి ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారన్నారు. పెద్దాపురంలో జనసేన పార్టీ విజయం తధ్యమని, అలా కాకపోతే తాను మీరు చేసిన ఆరోపణలను స్వాగతిస్తామని లేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని సవాల్ విసిరారు. మీలా బలవంతపు జన సమీకరణలు చేసి యాత్రలు చేయడం మాకు చేతకాదని, మాపార్టీ అధినేత పవన్ చేస్తున్న యాత్రలకు ప్రజలు అభిమానంతో వస్తున్నారన్నారు. అలాగే నీపాదయాత్ర కారణంగా ఇక్కడి రోడ్డు అపవిత్రమయ్యాయని అందుకే వాటిని పసుపు నీటితో శుద్ధి చేసి ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తమనార లక్షణ దివాకర్, పెంకే వెంకటలక్ష్మి, కంచుమర్తి రాజన్న, భద్రనాయుడు, గొల్లపల్లి శ్రీను, కె. నాగబాబు, అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







