UPDATED 24th SEPTEMBER 2019 TUESDAY 8:00 PM
రాజానగరం (రెడ్ బీ న్యూస్): విద్యార్థులు సేవా దృక్పధంతో ముందుకెళ్లి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్ అన్నారు. స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ 50వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్ధేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా అధ్యయనం చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో జీవన పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ఎన్ఎస్ఎస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని అన్నారు. సమాజంలో సేవా దృక్పధాన్ని పెంపొందించడానికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మంచి సారధులుగా వ్యవహరిస్తూ సమాజాభివృద్ధిని అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతే హీ సేవా కార్యక్రమంలో భాగంగా కళాశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్.బి.ఎస్ డీన్ డాక్టర్ వి. కుసుమకుమారి, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ డి. వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం.వి. సుబ్బారావు, వి. సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.డి. శివప్రసాద్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







