UPDATED 9th OCTOBER 2018 TUESDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రముఖ అంతర్జాతీయ క్రైస్తవ మతభోదకులు బ్రదర్ అనిల్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ప్రసంగిస్తూ యువతలో నైతిక విలువలు పెంపొందించేందుకు, వారిలో ఆధ్యాత్మిక భావాలు ద్విగుణీకృతం చేయడానికి, సత్ప్రవర్తన, క్రమశిక్షణతో ఎదగడానికి ఆధ్యాత్మిక మందిరాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ఇంతటి ఘనమైన కార్యము తలపెట్టిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి వారి కుటుంబం, విద్యాలయాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన క్రైస్తవ మతబోధకులు క్రిస్టియన్ మతం యొక్క ఔన్నత్యాన్ని, విద్యార్థులు ఆచరించవలసిన మార్గాన్ని వివరించారు. అనిల్ కుమార్ ప్రార్ధన గీతాలతో సభాస్థలిలో గల సభ్యులు ఎంతో భక్తి పారవశ్యంతో ఆనందానుభూతి పొందారు. అనంతరం అనిల్ కుమార్ ను ఆదిత్య యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ సిన్హా కొమ్మనాపల్లి, డాక్టర్ డేనియల్ పాల్, డాక్టర్ పి. విజయకుమార్, డాక్టర్ జుహాని హలోసన్, డాక్టర్ శామ్యూల్ సాగర్, డాక్టర్ జోసెఫ్ బెన్నీ, రత్నరాజు, మూర్తిరాజు, జోసెఫ్ రాజు కొమ్మనాపల్లి, పి. జాన్ పాల్, జి.జోసెఫ్, డాక్టర్ జానీవెస్లీ, బ్యులా మేడం, ఏసురత్నం, ఎం.ఏ.పి. విజయ్ కుమార్, నటరాజ్ లాజరస్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులు, కృష్ణదీపక్ రెడ్డి, సుగుణారెడ్డి దంపతులు, అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదర, సోదరీ మణులు పాల్గొన్నారు.







