UPDATED 11th JUNE 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: మండలంలోని పవర గ్రామంలో గల వ్యవసాయ చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సుమారు 55 ఎకరాల ఈ చెరువు పరిధిలో 200 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయని, ఈ చెరువును నాలుగు భాగాలుగా చేసి చేపల చెరువులుగా ఉపయోగిస్తున్నారని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆరోపించారు. ఐదవ విడత జన్మభూమి కార్యక్రమంలో ఈ విషయమై రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంట కాలువలను మూసివేస్తున్నారని, దీనివల్ల పొలాలకు నీరు అందడం లేదని, వర్షం వచ్చినప్పుడు చంద్రంపాలెం, చిత్రాడ గ్రామాలలోని నీరు మా గ్రామం, వ్యవసాయ భూముల్లోకి ప్రవహించి ముంపుకు గురవుతున్నాయని వారు ఆరోపించారు.







