UPDATED 5th DECEMBER 2017 TUESDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఆంగ్లభాషా విభాగం ఆధ్వర్యంలో "ఆంగ్లభాషా బోధనలో నూతన ఆవిష్కరణలు" అనే అంశంపై ఐదురోజులు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆంగ్లభాషా ఉపన్యాసకులు పాల్గొంటారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభూప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాల ఆంగ్లభాషా విభాగం బోధనాపద్దతిలో అధునాతనంగా అనుసరిస్తున్న వివిధ పద్దతులపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (EFLU)కు చెందిన ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి, డాక్టర్ జి.సువర్ణలక్ష్మి హాజరవుతారని, జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా ఆంగ్లభాషలో చోటుచేసుకుంటున్న పలు మార్పులు, భోధనా విధానాలపై అవగాహన కలగడమే కాకుండా ఆంగ్లభాషా భోధనకు సంబంధించిన పలు అంశాలలో ఆంగ్లభాషా బోధకుల నైపుణ్యాలు పెంపొందుతాయని కార్యక్రమ కన్వీనర్ ఎం.మాధవి తెలిపారు.







