UPDATED 18th SEPTEMBER 2017 MONDAY 7:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 58 వ శరన్నవరాత్ర మహోత్సవాలకు సోమవారం సమితి గౌరవ సభ్యులు తోటకూర సాయిరామకృష్ణ, నువ్వుల హరనాథరావులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పందిరిరాట వేసి అంకురార్పణ చేశారు. సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రమణ్య శర్మ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 30 వ తేదీ వరకు నవరాత్రులు జరుగుతాయని, ప్రతీరోజు ఏకవార రుద్రాభిషేకాలు, లలితా సహస్రనామ పారాయణాలు, కుంకుమార్చనలు, సామూహిక అష్టలక్ష్మి పూజలు, సరస్వతి పూజలు జరుగుతాయని, దశమి రోజున అన్నసమారాధనతో ఈ కార్యక్రమాలు ఘనంగా ముగుస్తాయన్నారు. అనంతరం ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అందించిన ఆధ్యాత్మిక వారసత్వ సంపదను మనం భవిష్యత్ తరాలవారికి అందించవలసిన భాద్యత మనపై ఉందన్నారు. గత 58 సంవత్సరాలుగా ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు నువ్వుల వెంకట్రాజు, కార్యదర్శి వింజమూరి విశ్వనాథం, సభ్యులు మల్లిపూడి గంగాధర్, చవ్వాకుల సూర్యనారాయణ, నువ్వుల బాబ్జి, కమ్మిల వెంకటేశ్వరావు, టి. సూర్య ప్రభాకర్, సాంబశివరావు, ఎం. శ్రీనివాస్, టి. నానాజీ, తదితరులు పాల్గొన్నారు.







