సమాజ సేవలో శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి

UPDATED 11th MAY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: "జ్ఞానినామ్ అగ్రగణ్యం" అనేది ఆర్యోక్తిని మనసా, వాచా, కర్మణా నమ్మి ఆచరించి నిరూపించిన సభ్యుల  సమ్మేళనమే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల  శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఒక గ్రామం అభివృద్ధి పథాన నడవాలన్నా అది విద్యావంతులతోనే సాధ్యం అనే విషయం అందరికీ తెలిసిందే. పెదబ్రహ్మదేవం గ్రామంలో ప్రతి ఇంటా జ్ఞాన జ్యోతులు వెలగాలని, ప్రతి చిన్నారికి ఆ చదువులతల్లి కటాక్షం కలగాలనే సత్ సంకల్పంతో పెద్దలు వేసిన మార్గంలో పయనిస్తూ గ్రామంలోని విజ్ఞానవంతులైన యువత, గ్రామాభివృద్ధిని కాంక్షించే విజ్ఞులైన పెద్దలు, స్వచ్చంద సంస్థల సహకారంతో గ్రామంలో చిరుసేవలను అందించే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతోంది శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి. 1960  మే నెల 11వ తేదీన ఆవిర్భవించిన ఈ సేవాసమితి ఆదర్శవంతమైన యువతతో సమాజహిత కార్యక్రమాలతో అడుగులు వేస్తూ 58వసంతాలుగా గ్రామంలో ఆధ్యాత్మిక విత్తులు జల్లుతూ మానవ సేవే మాధవ సేవ అన్న శ్రీ రామకృష్ణ పరమహంస పలుకులను మనస్ఫూర్తిగా స్వీకరించి ఆచరించి చూపుతూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమితి సర్వ సభ్య సమావేశంలో వక్తలు మాట్లాడుతూ సమితి ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతుల నిర్వహణ, పదవతరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదవతరగతి విద్యార్థులకు నగదు పురస్కారాలతో ప్రోత్సహించుట ద్వారా విద్యకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తూ విద్యాభివృద్ధితోనే ప్రగతి సాధ్యమని తన వంతు కృషి చేస్తూ విద్యాపరమైన సేవలను అందిస్తోంది. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారదామాత, స్వామి వివేకానంద జన్మదినోత్సవ వేడుకలలో  వస్త్రాల పంపిణీ, శ్రీ శారదామాత మహాన్నదాన పథకం ద్వారా పేదలకు ప్రతీ నెలా ఐదు కేజీల వంతున ఉచిత బియ్యం పంపిణి, ఉచిత వైద్య శిబిరాలు  నిర్వహణ, మందులు పంపిణి, మొక్కలు పంపిణి వంటి కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలలో పిల్లలకు, వృద్ధులకు పాలు, బిస్కెట్ల పంపిణీ, విద్య యొక్క ఆవశ్యకత, వృక్ష సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం,   పట్ల అవగాహన కల్పిస్తూ, గ్రామంలో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను గావిస్తూ తమ వంతు సేవలు అందిస్తున్నామని అన్నారు. సమితి సేవలను మరింత విస్తృతపరిచేందుకు గ్రామంలో గల విద్యావంతులైన యువత, ఉద్యోగులు చేరి సహాయ, సహకారాలు అందించి సమితి నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనాలని సమితి గౌరవాధ్యక్షుడు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ, వ్యవస్థాపక సభ్యులు నువ్వుల హరనాధరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ కోరారు. వేసవి శిక్షణా తరగతుల నిర్వహణలో సహకరించిన చెవ్వాకుల సత్యనారాయణ, పేపకాయల ప్రసాద్, ఆనాల గోవిందు తదితర ఉపాధ్యాయ బృందానికి సమితి సభ్యులు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం వృద్దులకు బియ్యం, స్వీట్స్ పంపిణీ చేశారు. సాయంత్రం కుంకుమ పూజ, ఆరాత్రికం శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమాలు, ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్, కార్యదర్శి వి. విశ్వనాధ్, సభ్యులు త్రివర్ణ స్కూల్ కరస్పాండెంట్ తోటకూర వెంకటేశ్వరావు, నువ్వుల వెంకట్రాజు, టి.వి.వి. సత్యనారాయణ, మండవిల్లి శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us