UPDATED 17th APRIL 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక బ్రౌన్ పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెడ్పీ శత వసంత వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, జడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి హాజరైనారు. మందుగా వందేమాతరం గీతం ఆలపించి అనంతరం జిల్లా పరిషత్ శత వసంత వేడుకల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీటిసి సభ్యురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, విద్యార్థులు బాగా చదువుకుని పాఠశాలకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ఎంపిపి సత్తిబాబు మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో రాణించి మంచి భవిష్యత్తుని ఏర్పరుచుకుని గొప్పస్థాయిలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఉపాధ్యాయులు ఫణి కుమారి, ఫాతిమా, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







