ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: చర్చలతో విభేదాలను పరిష్కరించుకుందామని పైకి చెబుతున్న చైనా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్యను భారత్ ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టంచేసింది. కొత్తగా పేర్లు పెట్టడం ద్వారా ఈ వాస్తవాన్ని చైనా మార్చజాలదని తేల్చి చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చైనా చాలా ఏళ్లుగా వాదిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని ‘జన్‌గ్నాన్’ అని చైనీస్ పేరుతో పిలుస్తోంది. ఆ రాష్ట్రంలో మరో 15 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, రోమన్ అక్షరాలతో కూడిన అధికారిక పేర్లు పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసినట్లు పేర్కొంది. భౌగోళిక పేర్లపై చైనా క్యాబినెట్ అయిన ‘స్టేట్ కౌన్సిల్’ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యను చేపట్టినట్లు వివరించింది. ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు ఉన్నాయి. వాటికి సెంగ్కెజాంగ్, దాగ్లుంగ్ జాంగ్, మనిగాంగ్, డుడింగ్, మిగ్‌పెయిన్, గోలింగ్, డంబా, మెజాగ్ అనే పేర్లను పెడుతున్నట్లు చైనా ప్రకటించింది. నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్‌జుబ్ రి, కున్‌మింగ్‌జింగ్ ఫెంగ్ అని నామకరణం చేసింది. అలాగే రెండు నదులకు జెన్‌యోగ్మో, దులైన్ అని, ఒక పర్వత మార్గానికి ‘సె లా’ అని పేరు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది రెండోసారి. 2017లో కూడా ఇలాగే ఆరు ప్రాంతాలకు తమ అధికారిక పేర్లను డ్రాగన్ పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని వాదిస్తోంది. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అరుణాచల్‌లో భారత నాయకులు పర్యటించిన ప్రతిసారి చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







