UPDATED 10th JUNE 2020 WEDNESDAY 7:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రజక, టైలర్లు, నాయి బ్రాహ్మణులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుల అక్కౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లా కలక్టర్లతో, లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలక్టరేట్ కార్యాలయంలోని వివేకానంద మీటింగ్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 7,768 రజకులు, 4,085 నాయి బ్రాహ్మణులు, 13,225 మంది టైలర్లు మొత్తం 25078 లబ్ధిదారులకు రూ.25.08 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నగర పాలక సంస్థ పరిధిలోని 38వ వార్డుకు చెందిన కోటిపల్లి రామతులసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెల్లుబోయి వేణుగోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, డిఆర్ఓ సిహెచ్. సత్తిబాబు, బీసి కార్పోరేషన్ ఈడీ ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మీ, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ఇరుసుమల్ల విష్ణు, నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మాచవరపు సత్యనారాయణ, మాచవరపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







