* ల్యాండ్ మాఫియాకు సిబ్బంది అండదండలు
UPDATED 21 JANUARY 2026 WEDNESDAY 2.10 PM
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జనవరి 21 : పెద్దాపురం తహసీల్దార్ (Peddapuram Tahasildar) కార్యాలయం సెటిల్ మెంట్లకు అడ్డాగా మారడంతో ల్యాండ్ మాఫియా (Land Mafia) ఆగడాలు విజృంభిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ( BJP) కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు (Bikkina Visweswara Rao) ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తమ పార్టీకి చెందిన ఓ వ్యక్తి మ్యూటేషన్ ( Mutation) కోసం పీజీఆర్ఎస్ (PGRS) లో ధరఖాస్తు చేసుకున్నారని, అయితే సంబంధిత వ్యక్తికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మ్యూటేషన్ ను రద్దు చేశారన్నారు. సొంత ఆస్తులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు (Registered Documents) ఉన్నాసరే ల్యాండ్ మాఫియా లిటిగేషన్లు సృష్టించడమే పనిగా పెట్టుకుందని, దీనికి తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యాలయంలో పనిచేసే కొంతమంది అధికారులు రైతులను టార్గెట్ చేసి వసూళ్లకు తెగబడుతున్నారని, సెటిల్ మెంట్ చేసుకోకపోతే ఆన్ లైన్ నుంచి భూమిని మాయం చేస్తామని బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సమంజసమన్నారు. రైతులకు తెలియకుండా ల్యాండ్ మాఫియాకు భూములను మ్యూటేషన్ చేయడానికి తహసీల్దార్ కార్యాలయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, మ్యూటేషన్ ప్రకటనను పట్టణ పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించకుండా తూతూ మంత్రంగా కేవలం ఒక సచివాలయంలో ప్రదర్శించడంపై రెవెన్యూ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినవారిని బయట సెటిల్ మెంట్ చేసుకోవాలని కొందరు అధికారులు ప్రోత్సహించడంపై అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి న్యాయం కోసం ఎవరూ వచ్చినా పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలని ఆయన సూచించారు.







