* అధ్వానంగా పెద్దాపురం-సామర్లకోట రహదారి
* ప్రయాణికులకు తప్పని తిప్పలు
* ప్రమాదాలభారిన పడుతున్న వాహన చోదకులు
* పట్టించుకోని అధికారులు
UPDATED 26th JULY 2020 SUNDAY 5:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): సామర్లకోట నుంచి పెద్దాపురం పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రహదారి నిర్మించి కొంతకాలమే అయినా ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. సుమారు రూ.35 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి అప్పుడే గోతులమయంగా మారడంతో వాహన చోదకులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు. స్థానిక మణప్పురం గోల్డ్ కార్యాలయం సమీపంలో ఈరహదారికి భారీ గోతులు ఏర్పడి ప్రమాదభరితంగా మారింది. నిత్యం ఈ రహదారిలో వేల సంఖ్యలో వాహనాలు సామర్లకోట నుంచి పెద్దాపురం జంట పట్టణాల మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే గతంలో పైపులైన్ మరమ్మతుల పేరుతో అధికారులు ఈ రోడ్డును ఛిద్రం చేసేశారు. ఈ రహదారిలో ప్రయాణం వాహనదారులకు నరకాన్ని తలపిస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. ఈ రహదారికి కనీసం మరమ్మతులు నిర్వహించకపోవడంతో భారీ గోతులు ఏర్పడి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిత్యం పలు వాహన చోదకులు గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.







