★ డైరీలు ఆవిష్కరిస్తున్న ఉపకులపతి, ప్రతినిధులు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : సమష్టి కృషితో జేఎన్‌టీయూను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు పేర్కొన్నారు. శనివారం ఉపకులపతి నివాస ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. డైరెక్టర్ అకడమిక్ అడిట్, పీఆర్‌వో సాయిబాబు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ప్రసాదరాజు, గౌరవ అతిథులుగా రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ ఎల్.సుమలత, ఓఎస్‌డీ జి.ఏసురత్నం హాజరయ్యారు. ముందుగా ఉపకులపతి డైరెక్టర్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి 2022 డైరీ, క్యాలెండర్లు ఆవిష్కరించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ విభాగాలను బలోపేతం చేస్తామన్నారు. వర్సిటీకి న్యాక్ ఏప్లస్, ఎన్‌బీఏ గుర్తింపు కోసం ప్రయత్నించాలన్నారు. తద్వారా నిధులు మంజూరవుతాయని, అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. వచ్చే ఫిబ్రవరి రెండు, మూడో వారంలో 8వ స్నాతకోత్సవం జరపడానికి గవర్నర్ నుంచి ఆమోదం పొందామన్నారు. జులైలో యుసీఈకే ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకుఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలకు రూ.25 కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు. ఫుడ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులను మొదలు పెట్టామని చెప్పారు. డైరెక్టర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, విభాగాధిపతులు, టీచింగ్, నాన్‌టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, సిబ్బంది తదితరులున్నారు.







