UPDATED 11th FEBRUARY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ -2019లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ కు నిర్వాహకులు నాట్య సిరి అవార్డు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ముంబాయి నేషనల్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మైసూర్ అసోసియేషన్, దాదర్, ముంబాయిలో రెండు రోజులపాటు నిర్వహించిన ఆలిండియా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ లో ప్రసాద్ చేసిన పలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ప్రముఖ నాట్య నిపుణులు అనిల్ కుమార్ సింగ్ (ముంబయి), వినితా నాయర్ (బెంగుళూరు), అమరనాధ్ ఘోష్ (చెన్నై), సిహెచ్ అజయ్ కుమార్ (విజయవాడ), నేషనల్ డ్యాన్స్ అకాడమీ (ముంబాయి) రాష్ట్ర అధ్యక్షుడు మాధురి ప్రతాప్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ స్వాతి.పి.భరద్వాజ్ లు ఈ అవార్డును ప్రసాద్ కు అందచేసి పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. దేశ, విదేశాల్లో పలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్న నృత్యకారుడు ప్రసాద్ ను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో నృత్యకారుడు ప్రసాద్ మాట్లాడుతూ ఆలిండియా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ లో పాల్గొని నాట్యసిరి పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హెూంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), కంచి మహాసంస్థానం చైర్మన్ చంధ్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు సింగవరపు సాయిబాబు, తులసీధరరావు సోదరులు, ప్రముఖ నవలా రచయిత, సీనియర్ నాటక కళాకారులు అంబటి అప్పారావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, భారత మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), రోటరీ క్లబ్ నాయకుడు అంబటి సుబ్రహ్మణ్యం, శ్రీ వీరభద్ర జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్ర ప్రసాద్ (అస్ట్రో ప్రసాద్), తదితరులు అభినందించారు.







