UPDATED 4th APRIL 2018 WEDNESDAY 7:00 PM
కాకినాడ: జిల్లాలో 216 జాతీయ రహదారి నాలుగు లేన్లుగా చేపడుతున్న విస్తరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈ పనులలో భాగంగా కాకినాడ బైపాస్ నుంచి కత్తిపూడి వరకు ప్యాకేజి-1 ద్వారా చేపడుతున్న విస్తరణ పనులను కలక్టరు బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు విస్తరణ పనులు ఏ విధమైన జాప్యం లేకుండా నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలక్టరు కాకినాడ బైపాస్, పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా బైపాస్ రోడ్డు పనులు వల్ల రాముడు చెరువు దెబ్బతిందని, తద్వారా సంబంధిత రైతులు తమ భూములు సేద్యానికి ఇబ్బంది కలుగుతుందని చేసిన విజ్ఞప్తిపై కలక్టర్ స్పందిస్తూ రాముడు చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని జాయింట్ కలక్టర్-2 జె. రాధాకృష్ణమూర్తిని, పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావును ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ లో రోడ్డు విస్తరణ పనులకు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలక్టరు మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తరణ పనులు పగలు, రాత్రి చేపట్టాలని దీనికి అవసరమైన మిషనరీ, సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పనులలో జాప్యాన్ని నివారించడానికి ప్రోజెక్ట్ ఇంజనీర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కత్తిపూడి వద్ద జాతీయ రహదారితో 216 రోడ్డును అనుసంధానం చేసే రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే ప్యాకేజీ-1 విస్తరణ పనులలో భాగంగా ఉన్న 14 ప్రోజెక్ట్ కట్టడాలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ విస్తరణ పనులను మే మొదటి వారంలో తిరిగి పరిశీలిస్తానని కలక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్యాకేజీ-2 పనుల్లో భాగంగా ఎడిబి రోడ్డు కలిపే జంక్షన్లో సంకేతాలు ఏర్పాటు చేయాలని కలెక్టరు సూచించారు. ఈ విస్తరణ పనుల్లో భాగంగా ప్యాకేజీ-3, 4 పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ప్యాకేజీ-3లో భాగంగా గురజనాపల్లి నుండి 18 కి.మీ. రోడ్డును ఏప్రిల్ చివరి నాటికి బిటి రోడ్డు వేసి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్యాకేజీ -4 పనులకు భూ సేకరణ పూర్తి అయ్యిందని, ఈ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ బైపాస్ నుండి తిమ్మాపురం రోడ్డు విస్తరణ చేయాలని, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్&బి ఎస్.ఈని కలక్టర్ ఆదేశించారు. కాకినాడ బైపాస్ నుండి తిమ్మాపురం మీనాక్షి థియేటర్ ప్రాంతం వరకు 6.7 మీ. వెడల్పు మాత్రమే ఉందని, మిగిలిన ప్రాంతంలా ఈ రోడ్డును కూడా 10 నుంచి 12 మీటర్లు విస్తరణ చేయాల్సి ఉందన్నారు. ఈ పర్యటలో జాయింట్ కలక్టర్-2 జె. రాధాకృష్ణమూర్తి, నేషనల్ హైవే-216 ప్రోజెక్ట్ డైరెక్టర్ జి.హరికృష్ణ, టీమ్ లీడర్ జి.వి. రావు, ఎఈ వెంకటరమణ, ప్రోజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ, ముజందర్. తదితరులు పాల్గొన్నారు.







