UPDATED 16th AUGUST 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక రాష్ట్ర సర్వే ట్రైనింగ్ అకాడమీలో విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 81 మంది ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లకు 30 రోజుల పాటు సర్వే అంశాలపై శిక్షణా తరగతులు ప్రారంభమైనట్లు రాష్ట్ర సర్వే అండ్ రెవెన్యూ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్.వి.ఎస్.ఎన్. కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికి సంబంధించిన రికార్డులు, సర్వేపై ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణలో ఇచ్చే ప్రతీ అంశాన్ని పూర్తి శ్రద్ధతో నేర్చుకోవాలని అన్నారు. శిక్షణ పూర్తి అయిన తరువాత ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పరీక్ష ఉంటుందని, ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రమోషన్లు ఉంటాయని అన్నారు. అలాగే నూతనంగా ఎంపికైన 30 మంది వీఆర్వోలు, 22 మంది రెవిన్యూ సబార్డినేట్లుకు రాజమహేంద్రవరంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వీరందరికీ శిక్షణలో భాగంగా ఫీల్డ్ విజిట్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇనస్పెక్టర్ ఆఫ్ సర్వే టి. త్రివిక్రమరాజు, సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ గరికిపాటి నమశ్శివాయ, కమలేంద్రప్రసాద్, బ్రహ్మారావు, తదితరులు పాల్గొన్నారు.







