చాచా నెహ్రూకు వినూత్నంగా శుభాకాంక్షలు

UPDATED 13th NOVEMBER 2017 MONDAY 9:00 PM

సామర్లకోట: నవభారత నిర్మాత భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి ఈ నెల 14 న కావడంతో ఆయనకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన తోటకూర వెంకట శివ సూర్య సాయివంశీ వినూత్నంగా గణిత చదరాలతో శుభాకాంక్షలు తెలియచేసాడు. జవహర్ లాల్ నెహ్రూ 128 వ జయంతిని పురస్కరించుకుని ఎటు కూడినా 128 వచ్చే విధంగా గణిత చదరాన్ని రూపొందించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. జాతీయ నాయకుల పుట్టిన రోజులు, పండుగలకు వెంటనే తన గణిత మాయా చదరాలతో శుభాకాంక్షలు తెలియచేసి తన వైవిధ్యాన్ని తెలియచేస్తుంటాడు. తన పెదనాన్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ గణితావధాని తోటకూర సాయి రామకృష్ణ స్ఫూర్తితో ఆయన వద్ద తాను కూడా గణిత చదరాలను రూపొందించడంలో తర్ఫీదు పొందినట్లు వంశీ తెలిపాడు. గణితావధానాన్ని తొమ్మిదవ తరగతి చదువుతున్నపుడే రామానుజన్ గణిత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.వి.వి. సత్యనారాయణ, అకాడమీ సెక్రటరీ నాగార్జున సమక్షంలో విజయవంతంగా చదరాన్ని రూపొందించి బాల గణితావధానిగా గుర్తింపు పొందాడు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ గణితం పట్ల తనకు ఎంతో మక్కువని, గణితావధాన ప్రక్రియను ఔపోసన పట్టడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ప్రకాశం పంతులు, కలాం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ మొదలైన వారి జయంతులు సందర్భంగా చదరాలను రూపొందించినట్లు వంశీ తెలిపాడు. కాకినాడ ఆదిత్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న వంశీని మరిన్ని అవధాన కార్యక్రమాలు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు గణితావధాని సాయి రామకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంశీని పూలమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, సెక్రటరీ నల్లమిల్లి దీపక్ రెడ్డి, ప్రిన్సిపాల్ రమణి తదితరులు వంశీని అభినందించారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us