UPDATED 5th JUNE 2018 TUESDAY 7:30 PM
గండేపల్లి: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడ కష్టతరమవుతుందని, ప్రజారోగ్యంపై ప్లాస్టిక్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను నిషేధించాలని, జనపనారతో చేసిన సంచుల వాడకంపై ప్రజలకు విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు. భావితరాలకు స్వచ్చమైన, ఆరోగ్యవంతమైన కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, అందుకు ప్రతీ ఒక్కరూ, ప్రతీ ఇంటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జె.బి.ఎం. రాజు, ఎం. సోమిరెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







