UPDATED 26th DECEMBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని సిపిఐ పట్టణ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దిరెడ్డి సత్యనారాయణ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 95వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయమైన చండ్ర రాజేశ్వరరావు భవనంలో పార్టీ పతాకాన్ని సీనియర్ కామ్రేడ్ పోతుల బాపిరాజు గురువారం ఆవిష్కరించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎలిశెట్టి రామదాసు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల అర్జునరావు, సప్త సూరిబాబు, తదితరులు విప్లవ గేయాలు ఆలపించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు రామదాసు మాట్లాడుతూ పేద ప్రజల పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, నిరంతరం పేద ప్రజల సమస్యలపై, వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు సాగిస్తున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డి బోడకోండ, అడపా చిట్టిబాబు, ఇండిగ రమణ, రాయి సీతారామయ్య, వాడపర్తి వెంకట్రావు, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







