UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊబా జాన్ మోజస్, కాళ్ళ లక్ష్మీనారాయణ అన్నారు. తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని కోరుతూ గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేరుకుపోయిన చెత్తను శుభ్రపరుస్తూ అనారోగ్యానికి గురయ్యే కార్మికుల పట్ల ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ, ఆ తీర్పును అమలుచేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. పర్మినెంట్ కార్మికుల మాదిరిగా కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారని, కనీస వేతనాలు జీవో నెం.151 ప్రకారం రూ.18 వేలు ఇవ్వాల్సి ఉందని, కొత్తగా 279 జీవోను ప్రవేశపెట్టి కార్మికులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఎఐటియుసి నాయకులు ఉప్పలపాటి చంద్రదాస్ మాట్లాడుతూ మున్సిపల్‌కార్మికులు ఏడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. 279 జీవో రద్దు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, కనీస వేతనాలు 151 జీవో ప్రకారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శీరంశెట్టి వెంకటేష్, బంగారు అప్పారావు, చింతల రమణ, సింగంపల్లి శ్రీనివాసు, వేల్పుల సింహాచలం, సి. లక్ష్మీ పైడిరాజు, కశింకోట మంగ, అల్లం రత్నం, సింగంపల్లి అనసూయ, బంగారు తులసి, బంగారు వెంకటగిరి, తదితరులు పాల్గొన్నారు.







