* రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్
UPDATED 10th DECEMBER 2019 TUESDAY 10:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): నేడు సమాజంలో సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించిందని, ప్రస్తుతం వార్తలు వేగం అనే దానిమీద పంపడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజె తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సమాజంలో మార్పు-మీడియా పాత్ర అనే అంశంపై చర్చా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ 1970వ శకంలో ప్రింట్ మీడియా మాత్రమే ఉండేదని, నాడు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు లేవని, నేటి సాంకేతిక పరిజ్ఞానంతో క్షణాల్లో వార్తలు పంపడం జరుగుతుందని అన్నారు. గతంలో ప్రెస్ అకాడమీ ద్వారా గ్రామీణ విలేఖరులకు జర్నలిజంపై శిక్షణా తరగతులు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ ను నియమించడం జరిగిందని తెలిపారు. త్వరలో కమీషన్ చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేసి తన పనులను ప్రారంభిస్తుందని చెప్పారు. పాత్రికేయులు స్పష్టంగా తప్పులు లేకుండా వార్తలు పంపడం ప్రధానమని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి మాట్లాడుతూ మీడియా రంగం పరిపాలనలో నాలుగు ఎస్టేట్ లలో ఒక భాగమని, ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి పాత్రికేయులు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని అన్నారు. ఐజేయు జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వాస్తవాల పట్ల నిబద్ధత, సమాజం పట్ల జవాబుదారీతనం పెంపొందించుకున్నప్పుడే మీడియా విశ్వసనీయత పెరుగుతుందని, సమాజ శ్రేయస్సు బాధ్యత పూర్తిగా పాత్రికేయులపైన ఉందని అన్నారు. గ్రామీణ పాత్రికేయుల శిక్షణ కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సహకారంతో ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అకాడమీ ద్వారా గ్రామీణ పాత్రికేయులకు జర్నలిజంలో మెళుకువలపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల జర్నలిజం వేగం పుంజుకుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ నయీమ్ అద్నాన్ అస్మి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ నాయకులు సోమసుందర్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీయుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుత దినపత్రికలు, కేబుల్ నెట్ వర్క్ గణాంకాల ప్రకారం వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఎం రేడియో ప్రాచుర్యం పొందిందని, భవిష్యత్తులో ఎఫ్ఎం రేడియోలో కూడా వార్తలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. పాత్రికేయులు తప్పనిసరిగా చట్టాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవాలని, పాత్రికేయులు నేటి సమాజంలో బహుతర బాధ్యతతో వ్యవహరించి పూర్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్, వైస్ చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, నల్లమిల్లి సతీష్ రెడ్డిలు మాట్లాడుతూ పాత్రికేయులకు వృత్తిపరమైన నైపుణ్యం పెంపొందించేందుకు నిర్వహించే శిక్షణా తరగతులకు ఐదు జిల్లాల పరిధిలో గల తమ విద్యా సంస్థల తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజె జిల్లా అధ్యకులు కె. స్వాతి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మండేల శ్రీరామమూర్తి, కార్యవర్గ సభ్యులు డి.ఎస్.ఎస్. రామాంజనేయరావు, జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాకుర్తి రాంబాబు, ఆహ్వాన కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.







